కూర్చొని చేసే ఈ సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్‌!

  • భోజనం తర్వాత షుగర్ పెరగడం సహజం
  • సోలియస్ పుష్-అప్‌ సులభమైన వ్యాయామం
  • చక్కెర పెరుగుదల 52 శాతం తగ్గొచ్చు
  • ఇన్సులిన్ స్పందన కూడా తగ్గే అవకాశం
  • 60 నుంచి 90 నిమిషాల తర్వాత చేయాలి
  • నడవలేని వారికి మంచి ప్రత్యామ్నాయం
భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం సహజం. కానీ అవి తరచూ ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కంటి ఇబ్బందుల ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని తగ్గించేందుకు నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అందరికీ ప్రతిసారి నడిచే అవకాశం ఉండదు. 

అలాంటి వారికి సులభమైన మార్గంగా ‘సోలియస్ పుష్-అప్’ ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కాళ్ల మడమలను పైకి కిందికి కదిలించే చిన్న వ్యాయామం. కుర్చీలో కూర్చునే దీన్ని చేయొచ్చు. ఆఫీసులో పని చేస్తూ కూడా సాధ్యమే. ప్రత్యేక పరికరాలు అవసరం ఉండవు.

చక్కెర స్థాయులపై ప్రభావం
‘iScience’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఈ వ్యాయామం భోజనం తర్వాత వచ్చే బ్లడ్‌ షుగర్‌ పెరుగుదలను 52 శాతం వరకు తగ్గించగలదు. ఇన్సులిన్ ప్రతిస్పందనను 60 శాతం వరకు తగ్గించే అవకాశం కూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. కాలి కండరాలు పనిచేసే సమయంలో రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి. దీంతో చక్కెర స్థాయులు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది.

ఎప్పుడు చేయాలి?
భోజనం ముగిసిన 60 నుంచి 90 నిమిషాల మధ్య ఈ వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలోనే సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు గరిష్ఠానికి చేరుతాయి. ఆ సమయంలో కాలి కండరాలను కదిలిస్తే మంచి ఫలితం కనిపించవచ్చు. రోజూ అలవాటు చేసుకుంటే మరింత ఉపయోగం ఉంటుంది.

ఎలా చేయాలి?
కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండాలి. పాదాల ముందు భాగం నేలపై అలాగే ఉంచాలి. తర్వాత మడమలను వీలైనంత ఎత్తుకు పైకి లేపాలి. మళ్లీ నెమ్మదిగా కిందకు దించాలి. వేగంగా చేయకుండా ఒకే రిథమ్‌లో కొనసాగించాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. శరీరానికి ఎక్కువ అలసట రాదు. అందుకే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది దీన్ని ప్రయత్నించొచ్చు.

సోలియస్ కండరం ప్రత్యేకత
మన కాలి వెనుక భాగంలో ఉండే సోలియస్ కండరం సాధారణ కండరాల కంటే భిన్నంగా పనిచేస్తుంది. ఇది శక్తి కోసం శరీరంలో నిల్వ ఉన్న గ్లైకోజన్‌పై ఎక్కువగా ఆధారపడదు. రక్తంలో ఉన్న చక్కెర, కొవ్వులను ఆక్సిజన్ సాయంతో వినియోగించుకుంటుంది. అందుకే ఎక్కువసేపు పని చేసినా త్వరగా అలసిపోదు.

నడకకు ప్రత్యామ్నాయం కాదు
భోజనం తర్వాత 10 నిమిషాల నడక ఎప్పటికీ అత్యుత్తమ మార్గమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నడకలో శరీరంలోని పెద్ద కండరాల సమూహాలు పనిచేస్తాయి. అయితే బయటకు వెళ్లే అవకాశం లేని సమయంలో సోలియస్ పుష్-అప్ మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. చిన్న కదలికతోనే ఆరోగ్యానికి మేలు చేసే అలవాటుగా దీన్ని భావిస్తున్నారు.

Soleus Push up
Blood Sugar Control
Sitting Exercises for Diabetes
Post Meal Glucose Levels
Diabetes Management Tips
Soleus Muscle Exercise

More Telugu News